తుంగభద్ర ఎగువ కాలువ కింద ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేయాలని రాస్తారోకో
తుంగభద్ర ఎగువ కాలువ (HLC) కింద ఆయకట్టు భూములకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం, సీపీఎం నాయకులు అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉద్దేహళ్ గ్రామం లోని బళ్లారి-గుండ్లపల్లి ఆర్ అండ్ బి అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
కళ్లెదుటే నీరు వెళ్తున్నా ఆయకట్టు భూములకు ఎందుకు ఇవ్వడం లేదని రైతు సంఘం నాయకులు ఓబులేష్, నాగమణి, చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. కర్ణాటకలో ఇదే కాలువ కింద పంటలు సాగు చేస్తున్నారని, కూతవేటు దూరంలో ఉన్న బొమ్మనహాల్ మండలంలో ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వరి, మిరప నారులు ఆలస్యం కావడంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి గంటపాటు నిరసన తెలిపారు.
ఈ నెల 25వ తేదీలోగా హెచ్ ఎల్ సి ఆయకట్టుకు నీరు వదలకపోతే తూములు ఎత్తి తామే నీరు తీసుకుంటామని రైతు సంఘం నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
విషయం తెలుసుకున్న బొమ్మనహాల్ ఎస్సై నబిరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
