Latest Posts

బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు దక్కని చోటు: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు లభించేవని, అయితే ఈసారి ఒక్కరికి కూడా చోటు దక్కలేదని ఆయన గుర్తుచేశారు. పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, వర్గ రాజకీయాలే దీనికి ప్రధాన కారణమని పేర్కొంటూ, రాష్ట్ర నేతలంతా తమ వైఖరిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ బీజేపీలో నిరంతరం గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని, ప్రతి చిన్న విషయానికీ ఢిల్లీకి వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే సంస్కృతి పెరిగిపోయిందని రాజాసింగ్ విమర్శించారు. నాయకుల మధ్య ఉన్న ఈ తీవ్ర విభేదాల వల్లే ‘తెలంగాణ నేతలు మారరు’ అనే ముగింపునకు అధిష్ఠానం వచ్చి ఉంటుందని, అందుకే ఎవరికీ కార్యవర్గంలో స్థానం కల్పించలేదని వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం జాతీయ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోందని పేర్కొంటూ, రాష్ట్ర నేతలంతా పాత విభేదాలను, స్వార్థ ప్రయోజనాలను పక్కనబెట్టాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ తరహాలో ఐక్యంగా పోరాడి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని, కలిసికట్టుగా పోరాడితేనే భవిష్యత్తులో అధిష్ఠానం తగిన గుర్తింపు ఇచ్చి పదవులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు.

Editor