కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి హత్యాయత్నం కేసులో న్యాయస్థానం నుంచి స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఎమ్మెల్యేతో పాటు మరో 28 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనపై నమోదైన ఇతర కేసులు ఇంకా పెండింగ్లో ఉండటం, వాటికి సంబంధించి బెయిల్ రాకపోవడంతో ఆయన ప్రస్తుతం కర్నూలు కారాగారంలోనే రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు.
కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లా చిప్పగిరిలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే విరూపాక్షి మరియు ఆయన అనుచరులు తనపై దాడి చేసి కారును ధ్వంసం చేశారని టీడీపీ మండల అధ్యక్షుడు పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సుచిత్ర అనే దళిత మహిళపై కూడా దాడి జరిగినట్లు ఆరోపణలు రావడంతో వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యేపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, కోర్టు ఆదేశాలతో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం హత్యాయత్నం కేసులో బెయిల్ వచ్చినప్పటికీ, అట్రాసిటీ కేసులో ఇంకా బెయిల్ లభించకపోవడంతో విరూపాక్షి మరికొంత కాలం జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
