కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీహెచ్ అగ్రహారానికి చెందిన గణేష్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి జూన్ 6న అదృశ్యమవగా, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ తదితర బృందాలు డ్రోన్లు, సీసీటీవీల సాయంతో ఎంత గాలించినా ఇప్పటివరకు చిన్నారి ఆచూకీ లభించలేదు.
పోలీసులు, అధికారుల వైఫల్యంపై న్యాయవాది శ్రీకాంత్ దాఖలు చేసిన పిల్ (PIL) పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. చిన్నారి ఆచూకీ కనిపెట్టేందుకు చేపడుతున్న గాలింపు చర్యలను నిరాటంకంగా, మరింత ముమ్మరంగా కొనసాగించాలని పోలీసులకు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ కేసుతో పాటు, గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అదృశ్యమైన చిన్నారుల వివరాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో మిస్సయిన ఆడ, మగ పిల్లల గణాంకాలు, వారిలో ఎంతమంది దొరికారు, ఇంకా ఎంతమంది ఆచూకీ తెలియాల్సి ఉందనే పూర్తి వివరాలను నివేదిక రూపంలో కోర్టుకు అందించాలని స్పష్టం చేసింది.
