భారత్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూలై 2026లో స్వల్పంగా పెరిగింది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో 4.38 శాతంగా ఉండగా.. జూలైలో 4.45 శాతానికి చేరింది. పెరిగిన ఆహార, నిత్యావసర వస్తువుల ధరలు ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి.
నెలవారీ ప్రాతిపదికన సాధారణ CPI సూచీ 0.9 శాతం పెరగగా, ఆహార ధరల సూచీ 2.1 శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం జూన్లో 4.74 శాతం నుంచి జూలైలో 4.84 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో కూడా 3.93 శాతం నుంచి 3.96 శాతానికి స్వల్పంగా పెరిగింది.
ఆహార ద్రవ్యోల్బణం జూన్లో 5.32 శాతంగా ఉండగా.. జూలైలో 5.52 శాతానికి చేరింది. అలాగే ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం 5.05 శాతం నుంచి 5.24 శాతానికి పెరిగింది. దీంతో ధరల పెరుగుదలపై సామాన్య ప్రజలపై మరింత భారం పడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
