చంద్రబాబు కీలక సమీక్ష.. పోలీస్‌ స్టేషన్ల పనితీరుపై సీఎం దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పాల్గొనగా.. రాష్ట్రవ్యాప్తంగా రేంజ్ ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు వర్చువల్‌గా హాజరయ్యారు.

రాష్ట్రంలోని 1,200కు పైగా పోలీస్ స్టేషన్ల నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు సహా దాదాపు 1,650 మంది పోలీసు అధికారులు ఒకేసారి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పనితీరు, కేసుల నమోదు విధానం, దర్యాప్తు ప్రక్రియతో పాటు ప్రజలకు వేగంగా న్యాయం అందేలా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు.

క్షేత్రస్థాయిలో ప్రజలకు పోలీసు వ్యవస్థ మరింత అందుబాటులో ఉండేలా పనిచేయాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Posted Under AP
Editor