అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.2,08,406 కోట్ల విలువైన భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఏకంగా 21,627 ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
పారిశ్రామిక ప్రోత్సాహకాలను వచ్చే డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల ద్వారా అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే సెప్టెంబరు నాటికి రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్రంలో ఏర్పాటు కానున్న డిఫెన్స్ ప్రాజెక్టులు దేశానికే గర్వకారణంగా నిలుస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ అమ్మోనియా, లిథియం-ఐయాన్ బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి ఆధునిక రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. సరికొత్త పారిశ్రామిక విధానాలు, మెరుగైన మౌలిక వసతులతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది.
