కర్నూలు జిల్లా ఆలూరు–గంజాయికి ఆలూరు అడ్డాగా మారిందా..?
–గంజాయి మత్తులో యువకులు బలి..అగ్రహారంలో రోడ్డు ప్రమాదంతో వెలుగులోకి వచ్చిన దారుణం
–గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న విక్రయాలపై అధికారుల నిఘా ఏదీ?
ఆలూరు న్యూస్..
ఆలూరు ప్రాంతంలో గంజాయి వినియోగం ఆందోళనకరంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు, వినియోగం కొనసాగుతుండటంతో పలువురు యువకులు దానికి బానిసలవుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆలూరు మండలం అగ్రహారం గ్రామంలో శనివారం తెల్లవారుజామున గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు లారీని ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన గ్రామస్తులు గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడ విక్రయిస్తున్నారనే విషయాలపై ఆరా తీసినట్లు సమాచారం. గంజాయి విక్రయిస్తున్నారనే అనుమానం ఉన్న వ్యక్తుల ఇళ్లకు వెళ్లి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గతంలోనూ గంజాయి మత్తుకు బానిసై పలువురు యువకులు అనారోగ్యానికి గురికావడంతో పాటు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా యువత గంజాయి బారిన పడుతుండటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగంపై కఠిన నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గంజాయి విక్రయిస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు యువతను ఈ వ్యసనం నుంచి కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆలూరు–గంజాయికి ఆలూరు అడ్డాగా మారిందా..?
