*రాయదుర్గంలో యాదవ సంఘం ఆత్మీయ సమావేశం
*యాదవులకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకే మద్దతు: జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్
*రాయదుర్గం, ఆగస్టు 2:* యాదవులను గుర్తించి పదవులు, సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ పార్టీలకే తమ మద్దతు ఉంటుందని యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. రాయదుర్గం పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయం వద్ద శనివారం నియోజకవర్గ యాదవ సంఘం ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. నియోజకవర్గ అధ్యక్షులు బంగి ఉమాశంకర్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభకు అఖిల భారత యాదవ సంఘం జాతీయ కార్యదర్శి రాజశేఖర్ యాదవ్, జిల్లా గౌరవాధ్యక్షులు నారాయణస్వామి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపాల్ యాదవ్, ఆవుల మనోహర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు రాజు యాదవ్, పరేశప్ప యాదవ్, కార్యదర్శి మేకల శ్రీనివాసులు యాదవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అశ్వర్థ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి జైపాల్ యాదవ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు రాధమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నూతనంగా జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణ యాదవ్ తొలిసారి రాయదుర్గం విచ్చేయడంతో సంఘ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సభ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ యాదవ్, రాజశేఖర్ యాదవ్ మాట్లాడుతూ యాదవుల సమస్యలను జిల్లా కమిటీ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారం కోసం జిల్లా సంఘం తరఫున తన వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. యాదవులందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యాదవ సమాజం సంఖ్యాపరంగా బలంగా ఉన్నప్పటికీ, జిల్లాలో రాజకీయంగా ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం సాధించలేకపోతున్నామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో యాదవులు క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, అయితే రాజకీయ పార్టీల కోసం పనిచేసే విధంగానే మన సమాజ అభివృద్ధి కోసం కూడా ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లో యాదవులు ముందుకు రావడానికి సంఘం ఒక వేదికగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యాదవ కార్పొరేషన్‌కు తగిన నిధులు కేటాయించి గొర్రెలు, మేకలు, పశుపోషణ కోసం రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించి యాదవులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు.
ప్రతీ నియోజకవర్గానికి రిజర్వేషన్ల ప్రాతిపదికన ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీపీతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లాలో ఒక మేయర్, ఒక మున్సిపల్ చైర్మన్, రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులను యాదవులకు కేటాయించాలని ప్రధాన పార్టీల అధ్యక్షులకు విజ్ఞప్తి చేశారు. యాదవ సంఘాన్ని జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన విస్తరించి బలోపేతం చేస్తామని, యాదవుల ఐక్యతను చాటేందుకు రాబోయే రోజుల్లో జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటుతామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తిమ్మరాజు, రామస్వామి , బంగి గోపి, ఏటూరి రాజు, ప్రసాద్, శ్రీలక్ష్మి, కేడిమి బాబు, మల్లికార్జున, నాగరాజు, పాల్గొన్నారు.
