అనంతపురం జిల్లా- రాయదుర్గం
కిలో రూ.50కే నాణ్యమైన బియ్యం అందిస్తున్న కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.
పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే బీపీటీ రకం బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గం పట్టణంలో సోమవారం బీపీటీ రకం బియ్యం పంపిణీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్థానిక రైస్ మిల్లర్ల సహకారంతో చౌకధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఒక్కో లబ్ధిదారునికి 10 కిలోల చొప్పున బియ్యం అందించేలా చర్యలు తీసుకుందని తెలిపారు. తొలిదశలో 100 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వివరించారు. ప్రస్తుత బహిరంగ మార్కెట్లో బీపీటీ రకం బియ్యం కిలో ధర సుమారు రూ.62 వరకు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పంపిణీ కేంద్రాల ద్వారా రూ.50కే అందిస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలు చేస్తున్న ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సూర్య ప్రతాప్ ,డిటి శ్యామ్, వీఆర్వో, మండల పార్టీ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, సెంట్రల్ స్టోర్ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ టoకశాల, ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్, హనుమంతు, రైస్ మిల్ చంద్ర, బిటి రమేష్, నాగప్ప, తదితరులు పాల్గొన్నారు.
