ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తుంగభద్ర ప్రాజెక్టులో తీవ్ర నీటి కొరత నెలకొన్నందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఖరీఫ్‌లో తుంగభద్ర ఆయకట్టు పరిధిలో సాగునీరు అందించడం అత్యంత క్లిష్టంగా మారిందని రాయదుర్గంలో
శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు అత్యంత ఆందోళనకర స్థాయిలో 9.80టీఎంసీలు ఉన్నాయన్నారు. గత 60 ఏళ్లలో ఇంత తీవ్రమైన నీటి కొరత పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. గత ఏడాది ఇదే సమయానికి సుమారు 73 టీఎంసీలు ఉండేవని, గత 60 ఏళ్ల సగటు తీసుకుంటే కనీసం 28 టీఎంసీలు డ్యామ్ లో చేరాల్సి ఉండేదన్నారు. ప్రస్తుతం జలాశయంలో సుమారు 9.8 టీఎంసీల మేరకే నీటి నిల్వలు ఉన్నాయని, అందులోనూ వినియోగానికి అందుబాటులో కొత్తగా వర్షాలకు వచ్చిన నీటి పరిమాణం చాలా తక్కువగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఈ ఖరీఫ్ సీజన్‌లో తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయడం సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయకట్టు పరిధిలో సాగునీరు ఇవ్వడం వీలు కాదని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేశారు. ఇంజనీరింగ్ నిపుణులు సైతం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏడాది అంచనాలకు అనుగుణంగా నీరు రావడంలేదని, పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నాయని స్పష్టం చేశారన్నారు. త్వరలో తుంగభద్ర పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అధికారికంగా తెలియజేస్తామన్నారు. రైతులు ఈపాటికే నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారని వివరించారు. ఎల్ ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం ఎదురవుతున్న నీటి సమస్యను రైతులు అర్థం చేసుకుని తదనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని ముందుగా తాగునీటి అవసరాలకు వినియోగించాలని తుంగభద్ర బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నీటిని అత్యంత పొదుపుగా వినియోగిస్తూ ప్రజల తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఆయకట్టు రైతాంగం ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంఛార్జిలు పోరాళ్ల పురుషోత్తం, ఇనాయత్, మాజీ కౌన్సిలర్లు కడ్డీపుడి మహబూబ్ బాషా, బండి భారతి, కురుబ ప్రశాంతి, బుదురు తిప్పేస్వమి, డబ్బిడి శివ,ఆనంద్,కొండాపురం శ్రీనివాసులు, కరెన్న తదితరులు పాల్గొన్నారు.
