కర్నూలు జిల్లా ఆలూరు గెస్ట్ హౌస్ లో ఆలూరులో బోయా వాల్మీకి సంఘం సమావేశం – ఎస్టీ హోదా సాధనకు పోరాటమే లక్ష్యమని తీర్మానం
ఆలూరు, జూలై 4: ఆలూరు పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో బోయా వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆగస్టు 5న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. సభకు వాల్మీకి సమాజానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బోయా వాల్మీకులకు ఎస్టీ హోదా సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని, ఈ అంశంపై ఐక్యంగా పోరాడాలని సమావేశంలో ప్రతిపాదించారు.
వివిధ రాజకీయ పార్టీలను నమ్మి కష్టపడి పనిచేసి ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయిన వాల్మీకి బిడ్డలకు అండగా నిలవాలని, వారికి న్యాయం జరిగేలా సంఘం తరఫున కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు.
అదేవిధంగా వాల్మీకుల అభివృద్ధిని అడ్డుకునే, వారి హక్కులను నిర్లక్ష్యం చేసే వారికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటుతో తగిన సమాధానం చెప్పాలని, వాల్మీకుల హక్కులు, గౌరవం, ఎస్టీ హోదా సాధన కోసం అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని సమావేశంలో పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోయా వాల్మీకి సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంజి, వాల్మీకి ఎరుగుడి రమేష్. వాల్మీకి గోపాల్, నాయకులు వీరేశు, గుత్తి నాగరాజు, లోకనాథ్, ఉచ్చురప్ప, రమేష్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన బోయా వాల్మీకి సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమావేశం ఉత్సాహభరితంగా, ఐక్యతా వాతావరణంలో ముగిసింది….
