జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయండి………

*జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయండి*

*చల్లా రాజేంద్రప్రసాద్ గారికి ఎమ్మెల్యే దగ్గుపాటి విజ్ఞప్తి*

*ఉద్యాన పంటలు – ఫుడ్ ప్రాసెసింగ్ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్*

*పండ్ల తోటలు సాగు చేసే ప్రతి రైతు లాభాలు చూడాలి*

*కూటమి ప్రభుత్వ లక్ష్యం అదేనన్న ఎమ్మెల్యే దగ్గుపాటి*

హార్టీకల్చర్ హబ్ గా మారుతున్న అనంతపురం జిల్లాలో 5రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్ గారికి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఉద్యాన పంటలు-ఫుడ్ ప్రాసెసింగ్-అవకాశాలు” అనే అంశం పై అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆర్.కే.ఫంక్షన్ హాల్లో జరిగిన కార్య నిర్వాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ఉద్యానశాఖ, ఎ.పి.ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, కాంటినెంటల్ కాఫీ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కాంటినెంటల్ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఉద్యానశాఖ అధికారులు, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ముందుగా ఉద్యానపంటల ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ పై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే, ఎంపీ తిలకించారు. అనంతరం అక్కడే కాంటినెంటల్ కాఫీ తాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఉద్యాన పంటల ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు. ఇక్కడ సాగునీటి వనరులు తక్కువగా ఉన్నప్పటికీ రైతులు ఎన్నో సాంకేతిక పద్ధతుల్లో పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ప్రోత్సాహాం అందిస్తున్నారన్నారు. జిల్లాకు డ్రిప్ విధానాన్ని పరిచయం చేసింది, ఇజ్రాయల్ తరహా టెక్నాలజీతో పంటల సాగును ప్రోత్సహించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని తెలిపారు. గతంలో డ్రిప్ సరిగా ఇవ్వకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలోనే 300కోట్ల రూపాయలతో డ్రిప్ రైతులకు అందించారన్నారు. ఏమారుమూల గ్రామంలో చూసినా డ్రిప్ విధానంలో సాగు కనిపిస్తుందన్నారు. జిల్లాలో నీటి కొరత లేకుండా తమ ప్రభుత్వంలో హంద్రీనీవా కాలువ మొదటి దశను పూర్తి చేశారన్నారు. ఇప్పుడు కూడా 3500కోట్లతో కాలువను వెడల్పు చేసి అన్ని ప్రాంతాలకు నీరు అందేలా చేస్తున్నారన్నారు. అయితే పండ్ల తోటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు లాభం రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక్క అరటి ఏడాదికి లక్షన్నర టన్నులు ఎగుమతి అవుతోందంటే జిల్లాలో ఏ విధంగా సాగవుతోందో తెలుస్తుందన్నారు. అయితే కొన్నిసార్లు ధరలు తగ్గిపోయిన సందర్భంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాటిని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. జిల్లాలో 5రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని చల్లా రాజేంద్రప్రసాద్ కు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. రైతుల కోసం నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఏర్పాటు చేసినా తమ వంతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.

Posted Under AP
Editor