సైబర్ డిఫెండర్ క్యాంప్ విజయవంతంగా పూర్తి చేసిన కేటీఎస్ విద్యార్థులు…

*సైబర్ డిఫెండర్ క్యాంప్ విజయవంతంగా పూర్తి చేసిన కేటీఎస్ విద్యార్థులు*

జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన నలుగురు క్యాడెట్లు – కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్
అనంతపురం: స్థానిక కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు ఎన్‌సీసీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సైబర్ డిఫెండర్’ (Cyber Defender) శిక్షణా శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేసి కళాశాలకు గర్వకారణంగా నిలిచారు.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జూన్ 14 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన ఈ జాతీయ స్థాయి సైబర్ డిఫెండర్ క్యాంప్‌కు 6 ఆంధ్రా బెటాలియన్ తరఫున కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎస్.ఎం.డి. అలీ, అశ్విని, ఆకాష్, యశోద ఎంపిక కావడం విశేషం. దేశవ్యాప్తంగా ఎంపికైన క్యాడెట్లకు సైబర్ భద్రత, డిజిటల్ రక్షణ, ఆన్‌లైన్ ముప్పులను ఎదుర్కొనే విధానాలపై ప్రత్యేక శిక్షణ అందించగా, కేటీఎస్ విద్యార్థులు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
క్యాంప్ పూర్తి చేసుకుని కళాశాలకు చేరుకున్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డి. సహదేవుడు అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొని కళాశాల ప్రతిష్టను పెంచడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
కళాశాల ఎన్‌సీసీ సీటీఓ కిరణ్ జక్కల మాట్లాడుతూ, కర్నూలు గ్రూప్ పరిధిలోని 6 ఆంధ్రా బెటాలియన్ నుంచి ఒకే కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఒకేసారి ఎంపిక కావడం విశేషమని, ఇది ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డి. సహదేవుడు, సీటీఓ కిరణ్ జక్కల, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో కళాశాల పేరు నిలబెట్టిన విద్యార్థుల విజయంపై కళాశాల వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

Posted Under AP
Editor