ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కీలక అడుగు…

*ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కీలక అడుగు..*

అమరావతి, జూన్ 23: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఆదాయ వనరులను విస్తరించడం లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక వనరుల సమీకరణ (రిసోర్స్ మొబిలైజేషన్) కోసం ఏర్పాటైన మంత్రుల వర్గ ఉపసంఘం సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో రాష్ట్ర ఆదాయ వనరుల పెంపు, కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ, పన్నుల వసూళ్లలో పారదర్శకత, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణ, పెట్టుబడుల ఆకర్షణ, ప్రజా సేవల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించే అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, శాఖల వారీగా ఆదాయ వృద్ధి అవకాశాలు, ప్రభుత్వ ఆస్తుల సమర్థ వినియోగం వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రాధాన్యత పొందాయి.

ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టి.జి. భరత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని తమ సూచనలు వెల్లడించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసి అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశంలో స్పష్టం చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.

Posted Under AP
Editor