నీట్ పునఃపరీక్షకు సర్వం సిద్ధం..

*నీట్ పునఃపరీక్షకు సర్వం సిద్ధం..*

*అభ్యర్థులు మధ్యాహ్నం 1.30 గంటలలోపు కేంద్రాలకు చేరుకోవాలి*

*పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఓ. ఆనంద్, ఎస్పీ పీ. జగదీష్*

అనంతపురం, జూన్ 20:
జూన్ 21న నిర్వహించనున్న నీట్-2026 పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరుగుతుందని, అభ్యర్థులు తప్పనిసరిగా మధ్యాహ్నం 1.30 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
శ్రీ సత్యసాయిబాబా నేషనల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పీ. జగదీష్‌తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా హాళ్లు, సీసీటీవీ వ్యవస్థలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు తప్ప ఇతరులను అనుమతించవద్దని, ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసేందుకు జామర్లు ఏర్పాటు చేయాలని, సీసీటీవీల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా ఉచిత ఆర్టీసీ బస్సులు నడపాలని, పరీక్ష సమయాలపై నిరంతరం అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో మొత్తం 3,959 మంది అభ్యర్థులు ఈ పునఃపరీక్షకు హాజరవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతపురం జిల్లాలో మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో అనంతపురం నగరంలో 7 కేంద్రాలు, గుత్తి పట్టణంలో 2 కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.
పరీక్ష నిర్వహణ కోసం జిల్లా రెవెన్యూ అధికారి ఏ. మలోలను నోడల్ అధికారిగా నియమించామని, ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. అభ్యర్థులు ఈ-అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని సూచించారు.
పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల రవాణాను కేంద్ర బలగాలు మరియు జిల్లా పోలీసుల భద్రత మధ్య నిర్వహిస్తామని తెలిపారు. అన్ని కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు చెప్పారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కీలక పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వదంతులను నమ్మవద్దని, అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ పీ. జగదీష్, తహసీల్దార్ శింగనమల తదితర అధికారులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor