రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

అనంతపురం జిల్లా రాయదుర్గం

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

చంద్రబాబు నాయకత్వంలోని కూటమి పాలనలో రైతులకు అందుతున్నంత ఆర్థిక సాయం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కెంచానపల్లిలో శనివారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విస్తృతంగా పనిచేస్తోందన్నారు. ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 42 వేల మంది రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా రూ.91.75 కోట్లు అందించామని, తాజాగా మరో రూ.28.8 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
ఇవే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీల కింద రూ.40 కోట్లు, వ్యవసాయ అనుబంధ సంస్థల ద్వారా సబ్సిడీల రూపంలో మరో రూ.30 కోట్లు రైతులకు అందాయని చెప్పారు. మొత్తంగా నియోజకవర్గ రైతులకు సుమారు రూ.200 కోట్ల మేర ప్రభుత్వ సహాయం చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడులు ఎదుర్కొంటున్నప్పటికీ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ రూపాల్లో ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక చేయూత అందిస్తోందన్నారు. రైతు సంక్షేమంతో పాటు పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ… దీపం పథకం కింద ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు, బాలికలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం పథకం కింద చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు “ఇంటింటికి వెళ్ళే” కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. రైతులు ముందస్తు జాగ్రత్తగా తక్కువ ఖర్చు, నీటితో సాగయ్యే కంది, ఆముదం, కొర్ర, జొన్న, ఉలవ వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అధిక నీరు, అధిక పెట్టుబడి అవసరమయ్యే పంటల జోలికి వెళ్లకపోవడం మంచిదని గుర్తు చేశారు. ప్రజలకు మంచి పాలన అందిస్తున్న చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కొనసాగాలని కోరారు. కనీసం 15 ఏళ్ల పాటు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం కల్పిస్తూ నిండు మనసుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కాలవ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కురుబ హనుమంతు,మార్కెట్ యార్డ్ చైర్మన్ యు.హనుమంత రెడ్డి,వైస్ ఛైర్మన్ ధానవేంద్ర, పోట్ల రవి, ఎర్రిస్వామి, సిద్ధప్ప, కాటా వెంకటేశులు,మురళి,తిమ్మారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor