అంగవైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులు…

అంగవైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులు
ఏపీ సమగ్ర శిక్ష అమరావతి ఆధ్వర్యంలో అరుదైన ఘనత – పసల ప్రసాద్‌తో పాటు కడపల శంకర్‌కు కలెక్టర్ అభినందనలు
శ్రీ సత్యసాయి జిల్లా, మే 11:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ సమగ్ర శిక్ష అమరావతి ఆధ్వర్యంలో నిర్వహించిన అడ్వెంచర్ స్పోర్ట్స్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది జోన్ల నుండి మొత్తం 919 మంది అంగవైకల్యంతో కూడిన విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 70 మందిని తుది ఎంపిక చేయగా, అందులో 25 మంది విద్యార్థులను ప్రత్యేక శిక్షణ కోసం ఎంపిక చేసి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ యాత్రకు పంపించారు.
ఈ బృందం ఏప్రిల్ 15న యాత్రను ప్రారంభించి, ఏప్రిల్ 25న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సుమారు 5364 మీటర్ల ఎత్తు వరకు చేరుకొని దేశభక్తిని చాటారు. అనంతరం ఏప్రిల్ 30న సురక్షితంగా తిరిగి వచ్చారు.
శారీరక లోపాలను, అంగవైకల్యాన్ని అధిగమించి ఈ అరుదైన ఘనత సాధించిన విద్యార్థులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో, ఎస్‌పీడీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు.
ఇదే సందర్భంలో శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన విద్యార్థి పసల ప్రసాద్‌ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శాలువా కప్పి అభినందించారు.
అలాగే తాడిమర్రి మండలం అగ్రహారం గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ అధికారి కడపల శంకర్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించి, ఎవరెస్ట్ యాత్రలో విజయం సాధించేందుకు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప, జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్పీ పుల్లన్న, సమగ్ర శిక్ష అభియాన్ ఐఆర్పీలు మురళి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
అంగవైకల్యాన్ని అధిగమించి సాహసయాత్రలో పాల్గొన్న ఈ విద్యార్థులు, అలాగే వారికి మార్గదర్శకత్వం వహించిన కోచ్‌లు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

Posted Under AP
Editor