ధర్మవరంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవానికి పటిష్ట బందోబస్తు – భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ధర్మవరంలో బుధవారం నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు అడిషనల్ ఎస్పీ శ్రీమతి అంకిత సురాన, ఐపీఎస్ తెలిపారు.
రథోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.
రథోత్సవం జరిగే ప్రధాన రహదారులు, భక్తుల రాకపోకల మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ పాయింట్లను సమగ్రంగా తనిఖీ చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయడంతో పాటు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేపట్టినట్లు తెలిపారు.
భద్రతా చర్యలలో భాగంగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, మహిళా భక్తుల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, తప్పిపోయిన చిన్నారుల కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని భక్తులను కోరారు.
అలాగే, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించాలని అడిషనల్ ఎస్పీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రెడ్డప్ప, నాగేంద్రప్రసాద్, శ్రీధర్, లక్ష్మీకాంత్ రెడ్డి, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
