అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం•••••
రాయదుర్గంలో వైభవంగా ‘ప్రగతి పండుగ’
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్ర చిరస్మరణీయంగా సాగాలని కోరుకుంటూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రగతి పండుగ’ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని జంబుకేశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య లోక కళ్యాణం కోసం ప్రత్యేక హోమాలు, త్రిపురసుందరి దేవి హోమాలు నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సకుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాయదుర్గం పట్టణంలో సుమారు రూ.62 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని నిధులు రాయదుర్గం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారని కొనియాడారు. ఎవరికీ సాధ్యం కాని పనులను ఆయన వెనుకబడిన ప్రాంతంపై ఉన్న ప్రేమ, అభిమానంతో చేసి చూపారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దాదాపు రూ.160 కోట్లు రాయదుర్గం పట్టణ అభివృద్ధికి మంజూరు చేశారని వివరించారు. ఇందులో వివిధ పద్దుల కింద ఇదివరకే రూ.10 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ‘అమృత్ 2.0’ పథకం కింద ప్రతి ఇంటికీ పైపులైన్ ద్వారా మంచినీటిని అందించేందుకు రూ.78 కోట్లు మంజూరు చేశారన్నారు. అర్ధాంతరంగా ఆగిపోయిన రైల్వే వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి మరో రూ.46 కోట్లు మంజూరు చేయించారన్నారు. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాయదుర్గం అభివృద్ధికి రూ.50 కోట్లు కావాలని కోరానని, అందులో భాగంగా డి ఎఫ్ ఐ డి కింద రూ.30 కోట్లు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని, త్వరలోనే వీటికి అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మారుమూలన ఉన్న ఒక పట్టణానికి కేవలం 22 నెలల కాలంలో రూ.160 కోట్లు మంజూరు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. రాయదుర్గం పట్టణాన్ని అన్ని ఆధునిక హంగులతో కూడిన ప్రముఖ పట్టణంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఆయన పాలనలో రాష్ట్ర అభివృద్ధి శరవేగంతో సాగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ జంబుకేశ్వరుడిని ప్రార్థిస్తూ ఈ 10 రోజుల ‘ప్రగతి పండుగ’ను నిర్వహిస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుడిని ప్రార్థించాలని సూచించారు. జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న హోమాలు, పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకూని దైవ అనుగ్రహం పొందాలని ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
