Latest Posts

రాయదుర్గం బైపాస్ రోడ్డులో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద సేఫ్టీ ఐరన్ బీమ్ కుప్పకూలింది

 

రాయదుర్గం, ఏప్రిల్ 7:
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే అధికారులు ఇటీవల ఏర్పాటు చేసిన సేఫ్టీ ఐరన్ బీమ్ కుప్పకూలి విరిగి పడిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారం ప్రకారం, వడ్ల లోడుతో వెళ్తున్న లారీ ఐరన్ బీమ్‌కు తగలడంతో అది కింద పడిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సేఫ్టీ ఐరన్ బీమ్ పిల్లర్‌తో సహా ఊడిపోవడం పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఘటన జరిగిన సమయంలో అటుగా వాహనాలు లేదా ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ రాకపోకలు ఎక్కువగా ఉండే ఈ బైపాస్ రోడ్డులో ఇలాంటి ఘటన జరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఘటన సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. రైల్వే మరియు మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, కుప్పకూలిన ఐరన్ బీమ్‌ను తొలగించే చర్యలు చేపట్టినట్లు సమాచారం.
స్థానికులు మాట్లాడుతూ, ఇటీవల ఏర్పాటు చేసిన రైల్వే అండర్ బ్రిడ్జి సేఫ్టీ ఏర్పాట్లలో నాణ్యత లోపాలు ఉన్నాయని, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Posted Under AP
Editor