రామాపురం గ్రామ అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్ కుంటాల పుల్లయ్యకు ఘన సన్మానం – ప్రజలకు కృతజ్ఞతలు
తాడిమర్రి మండలంలోని రామాపురం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచిగా పోటీ చేసిన కుంటాల పుల్లయ్య 2021లో విజయం సాధించిన విషయం తెలిసిందే. పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు.
గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, ఇంటింటికి కొలాయి సౌకర్యం, వాటర్ ట్యాంకుల ఏర్పాటు, ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ‘నాడు-నేడు’ నిధులతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. అలాగే గ్రామంలో త్రాగునీటి కొరత లేకుండా బోర్లు వేయించి, గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించి ప్రజల మన్ననలు పొందారు.
అదేవిధంగా, భూమిలేని పేదలకు అసైన్డ్ భూములు మంజూరు చేయించి, ప్రతి ఇంటికి పొజిషన్ సర్టిఫికెట్లు ప్రభుత్వ అధికారులతో కలిసి అందజేయించారు.
తన ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తయిన సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వైయస్సార్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారికి, తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
రామాపురం సర్పంచ్ కుంటాల పుల్లయ్యకు ఘన సన్మానం: ఐదేళ్ల అభివృద్ధి ప్రస్థానంపై గ్రామ ప్రజల హర్షం!
