అనంతపురం జిల్లా, రాయదుర్గం.
పదవీ కాలం పూర్తయినా పార్టీ నాయకులుగా గ్రామ సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా పనిచేయాలని తాజా మాజీ సర్పంచ్ లకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తాజా మాజీ సర్పంచులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకాపా పాలనలో అరాచకం, హింస, దౌర్జన్యాలన్నింటికీ తెగించి పోరాడి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలిపారన్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరగా పనిచేసే అవకాశం మీకు లభించిందన్నారు. అధికారంలో వారు ఉన్నారని, ఇబ్బందులు, ప్రలోభాలు పెడతారని తెలిసినా వాటన్నింటినీ భరిస్తూ పార్టీ ప్రతిష్టతను కాపాడారన్నారు. పసుపు జెండా గౌరవాన్ని నిలబెట్టిన సర్పంచ్ ల గౌరవార్థం ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. మూడేళ్ల వైకాపా పాలనలో జగన్ అనే దొంగ పాలకుడు గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం మంజూరు చేసిన నిధులను రాత్రికి రాత్రే కాజేశారన్నారు. ఇతర అవసరాలకు ఆ డబ్బు మళ్ళించి గ్రామాల్లో సర్పంచ్ లకు విలువ, గౌరవం లేకుండా చేశారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. గ్రామ పంచాయతీల నిర్వహణ, అభివృద్ధికి ఇస్తున్న నిధులను నేరుగా గ్రామ పంచాయితీల ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందన్నారు. తమకున్న అధికారం మేరకు గ్రామంలో అవసరాలను గుర్తించి సర్పంచులు వాటిని ఖర్చు పెట్టుకునే అవకాశం కల్పించారన్నారు. ప్రజా ప్రతినిధుల హక్కులను గౌరవిస్తూ వారి పని వారు చేసుకునేలా కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులను గౌరవిస్తున్నారన్నారు. నేడు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ లే కాకుండా వైకాపా సర్పంచులు కూడా చక్కగా పనులు చేసుకుంటున్నామని ఆనందంగా ఉన్నారన్నారు. ఐదేళ్ల సర్పంచుల పదవీకాలం పూర్తవడంతో గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైందన్నారు. “తమ పదవీకాలం పూర్తయింది, మాకు వేటితో సంబంధం లేదన్నట్లు” ఎవరు భావించకూడదన్నారు. పార్టీ అధికారంలో ఉన్నందున అదే స్ఫూర్తితో మునుముందు కూడా ప్రజా సమస్యలపై స్పందించాలని గుర్తుచేశారు. ముఖ్యంగా ప్రత్యేక అధికారులు, గ్రామ నాయకులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా వేసవిలో ఎక్కడ తాగునీటి సమస్య ఎదురుకాకుండా చూసుకోవాలన్నారు. భవిష్యత్తులోనూ అంతే బాధ్యత, పట్టుదలతో పని చేయాలని సర్పంచులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కాదలూరు మోహన్ రెడ్డి, కాలవ సన్నన్న, కురుబ హనుమంతు,బలరామిరెడ్డి, వన్నారెడ్డి తాజా మాజీ సర్పంచులు రాజశేఖర్ రెడ్డి, ఆవులదట్ల వన్నూరుస్వామి, జుంజురాంపల్లి వన్నూరుస్వామి, మారుతీ, జయరాం చౌదరి, సదాశివ, నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.
