Latest Posts

రాయదుర్గం బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం: రూ.46.24 కోట్లు మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

పట్టుబట్టి సాధించిన ప్రభుత్వవిప్
రాయదుర్గం బ్రిడ్జికి రూ.46కోట్లు

రాయదుర్గం పట్టణ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలిచే అనంతపురం రోడ్డులో అర్ధాంతరంగా నిలిచిపోయిన వంతెన నిర్మాణానికి మోక్షం లభించింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.46.24కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి సహకారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అలుపెరుగని పోరాటం దాగి ఉన్నాయి. సామాన్య ప్రజల కోసం ఢిల్లీ పెద్దలను సైతం ఒప్పించవచ్చని ఆయన ఈ నిధుల సాధన ద్వారా నిరూపించారు. బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా ఈ ప్రాజెక్టును విస్మరించలేదు. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంత పోరాటం చేస్తూ వచ్చారు. పట్టువదలని విక్రమార్కుడి కృషి ఫలించడం పట్ల పట్టణ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. తాను మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రోడ్లు, భవనాల విభాగం పరిధిలో ఉన్న అనంతపురం – రాయదుర్గం రహదారిని జాతీయ రహదారిగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా గుర్తిస్తే, అప్పటి వరకు మిగిలిన పనులను వన్ టైమ్ ఇంప్రూవ్మెంట్స్ కింద పూర్తి చేయాలనే నిబంధన ఉంది. ఆ నిబంధన మేరకు (ఎన్ హెచ్ 544 డి డి బైపాస్) రాయదుర్గం పట్టణ పరిధిలో 96/191 కిలోమీటర్ వద్ద బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాదించారు. దీనిపై పలు మార్లు ఎమ్మెల్యే కాలవ జాతీయ రహదారుల విభాగం ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు. గత రెండేళ్ల కాలంలో కేంద్ర రహదారుల శాఖాధికారులను ఒప్పించేందుకు ఢిల్లీ వరకు వెళ్లారు. బెంగళూరు, తుంకూరు కు వెళ్లి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి,సోమన్న తో పాటు ఉన్నతాధికారులకు విన్నవించారు. సంబంధిత ఉన్నతాధికారులకు నిరంతరం క్షేత్రస్థాయి నివేదికలు అందజేస్తూ ఒత్తిడి తెచ్చారు. సాంకేతిక కారణాలతో వారు కాలయాపన చేస్తూ వచ్చారు. ఆఖరకు గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాయదుర్గం పట్టణ ప్రజలకు అతి కీలకమైన ఈ సమస్యకు తక్షణమే పరిష్కార మార్గాలను చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి జనార్దన్ రెడ్డికి విన్నవించారు. అన్ని ప్రయత్నాలు ఫలించి ఈ వంతెన నిర్మాణానికి నిధులిస్తూ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాయదుర్గం ప్రజల చిరకాల కల నెరవేరబోతుంది. ఈ నిధుల మంజూరుతో పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా, రవాణా వ్యవస్థ మెరుగుపడి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. బ్రిడ్జి నిర్మాణం కోసం కాలవ శ్రీనివాసులు సాగించిన ఈ నిరంతర కృషి రాయదుర్గం రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. తన విన్నపాన్ని మన్నించి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, సహకరించిన మంత్రి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే కాలవ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో టెండర్లు ఆహ్వానించి పనులు అప్పగించడం జరుగుతుందన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయించి ప్రజా రవాణాకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమిస్తామని కాలవ స్పష్టం చేశారు.

Posted Under AP
Editor