శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో గురువారం ఆరుద్ర ఉత్సవం వేడుకగా జరిగింది. ఉగాది తర్వాత వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ మూర్తులు ఊరందూరు గ్రామానికి రావడం ఆనవాయితీగా ఉంది. గురువారం స్వామి అమ్మ వార్ల ఉత్సవమూర్తులు గ్రామానికి రాగా స్థానిక అన్నపూర్ణ దేవి సమేత నీలకంఠ స్వామి దేవస్థానం ఉత్సవ మూర్తులు స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్తానం ఈవో వెంకటేశులు, పర్యవేక్షకుడు నాగభూషణం యాదవ్, ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరిగింది. ఆలయంలోని ఆరుద్ర మండపంలో ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, తిరుప్పావడ సేవ జరిగాయి. సాయంత్రం తర్వాత ఉత్సవమూర్తులు శ్రీకాళహస్తికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా దారి పొడవున భక్తులు స్వామి అమ్మవార్లకు స్వాగతం పలికి కర్పూర నీరాజనాలు ఇచ్చారు.
వేడుకగా జరిగిన ఆరుద్ర ఉత్సవం – స్వామి అమ్మవార్ల సేవలో ఎమ్మెల్యే
