Latest Posts

గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్

విజయవాడ,అమరావతి :

 

పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం, గుడ్డు పెడుతుంటే దానిని అపహాస్యం చేస్తూ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు బాధాకరం అన్నారు ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి.

మధ్యాహ్న భోజన పథకం (డొక్కా సీతమ్మ బడి భోజనం), గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు కోడిగుడ్లు అందించడంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గరికపాటి తన ప్రసంగంలో ‘మధ్యాహ్న భోజనం అవసరమైంది. చదువు అక్కర్లేదు. చదువు మిద్యాన్నం అయిపోయింది, అన్నం తినేవాడికి కోడిగుడ్డు పెట్టడం ఏమిటి? ప్రభుత్వం పని చదువు చెప్పడం తప్ప బట్టలు, అన్నం పెట్టడం కాదు’ అని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత అయి ఉండి, పేద విద్యార్థులను ఉద్దేశించి ఇటువంటి మాటలు మాట్లాడటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు పోషకాహారం, పేద పిల్లలు ఖాళీ కడుపుతో వచ్చి చదువుకోకూడదని వారు గౌరవంగా జీవిస్తూ పాఠాలు వినేందుకు స్కీమ్ కొనసాగుతుంటే అవగాహన లేక, విషయం తెలియక మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా విజయ్ ప్రతాప్ రెడ్డి మధ్యాహ్న భోజన పథకం ప్రాముఖ్యతను, దాని వెనుక ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కులను వివరించారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు చేసి స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని, ప్రభుత్వాలు మొక్కుబడిగా పథకాన్ని అమలు చేయడం లేదని, సుప్రీంకోర్టు ఆదేశాలతో కొనసాగుతున్న అతి ముఖ్యమైన పథకం, ఆరోగ్యంగా జీవించడం అనేది విద్యార్థుల హక్కు అని స్పష్టం చేశారు. విజయ్ ప్రతాప్ రెడ్డి ప్రస్తావించిన ముఖ్యాంశాలు ఇవే..మధ్యాహ్న భోజనం అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, అది ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి బిడ్డకు ఉన్న ప్రాథమిక హక్కు. కేవడం జీవించడం మాత్రమే కాదు. గౌరవంగా బతకడం అనేది దాని ఉద్దేశం. పోషకాహారం పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు. 2001లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పిల్లలకు వండిన భోజనం అందించడం చట్టబద్ధమైన అవసరమని’ విజయ్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. కోర్టు దీన్ని ఓ రాజకీయ అంశంగా కాకుండా పిల్లలకు దక్కాల్సిన హక్కుగా భావించి తీర్పులు ఇచ్చినట్లు గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 43,701 విద్యా సంస్థల్లో సుమారు 31.42 లక్షల మంది విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ బడి భోజనం’ అందుతోంది. వారానికి ఐదు రోజులు కోడిగుడ్లు, చిక్కీలు, రాగిమాల్ట్ వంటి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యాహ్న భోజనం పథకానికి సంబందించిన ఖర్చులను భరిస్తాయని స్పష్టం చేశారు.
పిల్లల జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థ మెరుగుపడటానికి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ కలిగిన ఫోర్టిఫైడ్ రైస్ (పోషక బియ్యం) అందిస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ ఏ విద్యార్థికైనా భోజనం అందకపోతే, దానిపై ఫిర్యాదు చేస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా, విద్యార్థికి 120 శాతం పెనాల్టీ కూడా ఇప్పించే అధికారం కమిషన్‌కు ఉందని విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం, పుస్తకాలు, బట్టలు అందించడం వల్లే విద్యార్థుల సంఖ్య పెరిగిందని, తద్వారా టీచర్ల పోస్టులు కూడా భర్తీ అవుతున్నాయని ఆయన వివరించారు. ఎంతో మంది గొప్ప అధికారులు ప్రభుత్వ స్కూళ్లలో చదివి పైకి వచ్చారని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ సంస్థలతో పోటీ పడుతున్నాయని ఆయన గర్వంగా ప్రకటించారు.

నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఇది పేద పిల్లలకు సంక్రమించిన చట్టబద్ధమైన హక్కు అని, దీనిని ఎవరూ తక్కువ చేసి మాట్లాడకూడదని విజయ్ ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.

Posted Under AP
Editor