ఒక్కరి సాయం…
వేయి ఊళ్లకు దీపం.
……………………………….
*ప్రపంచానికి కాంతి తేజం.
*ప్రాజెక్టుల ఆశా కిరణం.
*చరిత్రకు ఎక్కిన రైతు లోకం.
*మట్టిలో మాణిక్యం.
………………………………..
వ్యవసాయంలో “సాయం” ఉంది. అన్నదాతలో “దాత” దాగి ఉంది.సాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి.
ఇక దానకర్ణుని మించిన మేటి. దాన్యపు గింజలు పండించి అందరి ఆకలిని తీర్చే అలుపెరుగని యోధుడు…నేడు ప్రపంచానికి వెలుగునిచ్చే కాంతి కిరణం అయ్యాడు. ప్రాజెక్టుల పాలిట ఆశా దీపమై మట్టిలో మాణిక్యం అనిపించు కున్నాడు.
ఒక్క సాయంతో వెయ్యి ఊళ్ళకు వెలుగును పంచుతున్నాడు. రైతు లోకాన్ని మరోసారి చరిత్రలో నిలబెట్టిన ధన్య జీవి కి మనం ఏమి ఇచ్చినా రుణం తీరదు. అదే మట్టి మనిషి మహత్యం.
ప్రాజెక్టులు అంటే అందరికీ భయం. భూములు కనుమరుగవుతాయని, రైతులకు కష్టాలు వస్తాయని అయితే ప్రస్తుతం మన సీమ ప్రాంతంలో అడుగు పెడుతున్న పవర్ ప్రాజెక్టుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రైతులకు మేలు చేస్తున్నాయి. ఆసరాగా నిలిచి ఆదుకుంటున్నాయి. స్వచ్ఛమైన నాణ్యమైన విద్యుత్ పునరుత్పత్తిని చేస్తున్నాయి. భగభగ మండే సూర్యుడు ఎండను విద్యుత్తుగా మార్చుతున్నాయి. గాలి గతి శక్తిని బంధించి గాలి మరలతో విద్యుత్ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. రాబోయే తరానికి సరిపడే విద్యుత్ ఉత్పత్తి నిలువ ఉంచి ట్రాన్స్మిషన్ టవర్ల ద్వారా సరఫరా చేస్తున్నాయి.
మన దేశం వికసిత్ భారత్ కావాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సౌర,పవన విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేసింది. పలు పవర్ ప్రాజెక్టుల అమలుకు పచ్చ జెండా ఊపింది. ఇందుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఏడాదిలో తీవ్రమైన ఎండలు.. ఆ ఎండకు మొక్క మొలవని పొలాలు.. కరువుకు శాశ్వత నిలయాలు అయినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ఇక్కడ బాగా పండుతుందని నిపుణుల కమిటీ తెల్చింది. దీనికి తోడు కనుచూపుమేర ఎటు చూసినా విశాలమైన, ఎత్తైన కొండలు కలిగి ఉండడంతో ఈ ప్రాంతంలో గాలి నుంచి గాలిమరల ద్వారా పవన విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
రాయలసీమ ప్రాంతంలో ఆలూరు, రాయదుర్గాన్ని సోలార్ హబ్ గా పత్తికొండ,ఉరవకొండ ప్రాంతాన్ని పవన విద్యుత్ ఉత్పత్తికి పుట్టినిల్లుగా ఎంచుకుంది. ఇక ఇక్కడ తయారైన విద్యుత్తును సబ్ స్టేషన్ లో నిలువ ఉంచుతారు. ఆ తర్వాత ట్రాన్స్మిషన్ లైన్లు విద్యుత్ కారిడార్ల ద్వారా అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తారు. దీంతో ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయిన విద్యుత్తును కడప జిల్లా సికే దినం నుంచి రాయదుర్గం మీదుగా సరిహద్దు కర్ణాటకలోని చిత్రదుర్గ,దావనగిరి, విజయనగర జిల్లాల మీదుగా తీసుకెళ్తారు.
ఈ పవర్ ప్రాజెక్టు వల్ల ఒక్క రైతుకు అన్యాయం జరగదు. భూములు బలవంతంగా లాక్కోవడం ఉండదు. భూములను కౌలుకు తీసుకోవడమో లేదా రైతుల భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వడమో జరుగుతుంది. జిల్లా కలెక్టర్ నేరుగా ఆయా ప్రాంతాల్లో పరిశీలించి అక్కడి పరిస్థితులను, మార్కెట్ ధరలను, పంటల విలువలను, ఉద్యాన పంటలకు వేరువేరుగా రైతులకు నష్టం జరగకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
