Latest Posts

నిరుద్యోగులకు ఇది నిజమైన ఉగాది….

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

 

నిరుద్యోగుల ఆశలను నిజం చేస్తూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఇది నిజమైన ఉగాదని స్పష్టం చేశారు.

రాయదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత జగన్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మాయమాటలతో వంచించిందని ఆరోపించారు. ఐదేళ్లు కాలయాపన చేస్తూ 13 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసి, వారిని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి చేసిందన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ప్రధాన స్థానాలన్నీ ఖాళీగా ఉండటంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే నిరుద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు సహకారంతో 20 నెలల కాలంలో ఆరు లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ప్రభుత్వ రంగంలోనే 30 వేల పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. ఉగాది పండుగ సందర్భంగా సుమారు పదివేల పోస్టుల భర్తీకి తాజాగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వం విశ్వసనీయతను చాటుకుందన్నారు. మంచి పాలనతో పెట్టుబడిదారులకు రాష్ట్రాన్ని స్వర్గధామంగా మార్చడంతో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు వచ్చారన్నారు. పరిశ్రమల ఏర్పాటు పూర్తి అయితే పారిశ్రామిక రంగంలోనే దాదాపు 25 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయన్నారు.
తాజా జాబ్ క్యాలెండర్ ద్వారా గ్రూప్-1, గ్రూప్-2 తో పాటు పలు కీలక శాఖల్లో 10,060 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యాశాఖలో ఉపాధ్యాయులతో పాటు జూనియర్ లెక్చరర్లు, ప్రొఫెసర్ల వంటి కీలక విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతోందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపడుతున్నామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో నిరుద్యోగుల భవిష్యత్తుకు చక్కటి భరోసా లభిస్తుందని తెలిపారు. అనేకమంది ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. నియామకాల్లో చిన్న లోపం కూడా తలెత్తకుండా అత్యంత పారదర్శకంగా ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి నిరుద్యోగులు అండగా ఉండాలని, వారి తల్లిదండ్రులు నిండు మనసుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కాలవ విన్నవించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కాలవ భరత్, పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, ప్రధాన కార్యదర్శి కిరణ్ పాల్గొన్నారు.

Posted Under AP
Editor