Latest Posts

ఏపీలో ఎన్ఎస్ టీఐ ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా..

ఏపీలో ఎన్ఎస్ టీఐ ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా
*రూ. 100 కోట్లతో అత్యాధునిక శిక్షణ
*యువతకు ఉద్యోగాలే లక్ష్యం
-ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు

చిత్తూరు:

ఆంధ్రప్రదేశ్ యువతకు ఆధునిక నైపుణ్యాలను అందించి, వారిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు చెప్పారు. ఏపీలో కొత్తగా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో ఎంపీ దగ్గుమళ్ల అడిగిన ప్రశ్నలకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

రూ. 100 కోట్లతో సరికొత్త కేంద్రం

ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. ఏపీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఈ ఎన్ఎస్ టీఐ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులు కేటాయించిందని, మూడేళ్ల కాలపరిమితిలో ఈ ప్రాజెక్టు పూర్తి కానుందని వివరించారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న ఎక్స్ టెన్షన్ సెంటర్ పరిమితిని పెంచుతూ, కొత్త సంస్థ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ

దేశ ఆర్థికాభివృద్ధిలో నైపుణ్యాభివృద్ధి శాఖ కీలక పాత్ర పోషిస్తోందని ఎంపీ కొనియాడారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా కోర్సులను రూపొందిస్తామని, ఇందుకోసం పీఎం-సేతు పథకం కింద రూ.60వేలు కోట్లతో దేశవ్యాప్తంగా ఐటిఐలను, శిక్షణా సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే రూ. 1,500 కోట్ల వ్యయంతో పరిశ్రమల భాగస్వామ్యంతో ‘నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తన సమాధానంలో వెల్లడించారని ఎంపీ వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 33 ఎన్ఎస్ టీఐల జాబితాలో ఏపీకి కొత్త సంస్థ చేరిందని… అక్టోబర్ 2025లోనే ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసిందన్నారు. యువతలో వ్యవస్థాపకతను పెంపొందించడం ద్వారా ఉపాధి కల్పన చేస్తామన్నారు. రాష్ట్ర యువతకు ఈ శిక్షణా సంస్థ ఒక వరప్రదాయినిగా మారుతుందని, తద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

Posted Under AP
Editor