తాడిమర్రి yes9tv15 సంవత్సరాల తర్వాత అన్నదమ్ముల భేటీ – గుర్రపు ప్రతిమల ఊరేగింపుతో భక్తుల ఆనందం
తాడిమర్రి మండలంలోని చిల్లవారి పల్లి సమీపంలో వెలసిన శ్రీ కాటి కోటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి సంబంధించిన సాంప్రదాయ కార్యక్రమం 15 సంవత్సరాల తర్వాత ఘనంగా నిర్వహించబడింది. గత కొద్ది సంవత్సరాలుగా అర్చకుడి విషయంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా నిలిచిపోయిన అన్నదమ్ముల భేటీ కార్యక్రమం ఈసారి యథావిధిగా జరగడం భక్తుల్లో ఆనందాన్ని నింపింది.
ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ అనంతరం నెలలోపు శ్రీ కాటి కోటేశ్వర స్వామి మరియు ఆరవేడు పట్నం పెద్దయ్య స్వామి అన్నదమ్ముల భేటీ కార్యక్రమం జరగడం ఆనవాయితీ. ఈ భేటీ కార్యక్రమం మొదటి పూజారి అయిన వీర బాలయ్య గుడి వద్ద జరగడం ప్రత్యేకతగా భావిస్తారు.
పురాణ కథనం ప్రకారం శ్రీ కాటి కోటేశ్వర స్వామి పెద్దవాడు, ఆరవేడు పట్నం పెద్దయ్య స్వామి చిన్నవాడు. ఇద్దరూ ఒకసారి ఆరవేటి మల్లెకి వేటకు వెళ్లిన సందర్భంలో ఎవరి పెద్ద పండుగ జరిగినా ఇద్దరూ కలిసి భేటీ కావాలని ప్రమాణం చేసుకున్నట్లు చెబుతారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
అయితే గత 15 సంవత్సరాలుగా అర్చకుడి వ్యవహారంలో గంగిరెడ్డి మరియు చిల్లవారి కాపుల మధ్య ఘర్షణలు తలెత్తడంతో ఈ కార్యక్రమం నిలిచిపోయింది. ఈసారి మళ్లీ అన్నదమ్ముల భేటీ కార్యక్రమం జరగడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
చరిత్ర ప్రకారం మొదటి పూజారి వీర బాలయ్య అక్కమ్మ గార్ల గుహ నుండి జలాలు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసేవాడని చెబుతారు. అతను చిన్నకోట్ల గ్రామానికి చెందిన ఏడు సంవత్సరాల లగువమ్మను చిన్న వయసులోనే వివాహం చేసుకున్నట్లు కథనం పేర్కొంటుంది. అదే సమయంలో పార్నపల్లి కి చెందిన గుది కోనేటి నాయుడు కాపులకు సంబంధించిన ముగ్గురు మగ పిల్లలను ఆవులు కాస్తూ ఉండగా వారి కాలువలను వచ్చి పోయే మార్గంలో పూడ్చివేస్తున్నాయని వారి తలలో నరకడం జరిగింది ఈ జరిగిన సంఘటనల్లో గంగిరెడ్డి, జానగాని చిల్ల కుటుంబాలకు చెందిన 12 మంది అన్నదమ్ములు కలిసి పెద్ద యుద్ధం జరిపినట్లు, ఆ యుద్ధంలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్రకారులు వివరిస్తున్నారు. ఆ యుద్ధంలోనే వీర బాలయ్య తన ఈటెతో తన రొమ్మును పొడుచుకుని వీరమరణం పొందినట్లు చెబుతారు.
ఈ కథనానికి అనుగుణంగానే ప్రతి సంవత్సరం శివరాత్రి అనంతరం నెలలోపు శ్రీ వీర బాలయ్య గుడి వద్దకు స్వాముల భేటీ కార్యక్రమం నిర్వహించడం ఆచారంగా కొనసాగుతోంది. అక్కడి నుంచి చిల్ల కొండయ్యపల్లి గ్రామం వరకు గుర్రపు ప్రతిమలతో భారీ ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా ఉంది.
ఈ సంవత్సరం కూడా చిల్లవారి పల్లి శ్రీ కాటి కోటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం నుండి గుర్రపు ప్రతిమలను భక్తులు కాలినడకన కొండ మార్గం ద్వారా వీర బాలయ్య గుడి వరకు తీసుకువచ్చారు. అనంతరం చిల్ల కొండయ్యపల్లి వరకు ఊరేగింపు జరిగింది.
పెద్దకోట్ల గ్రామంలో మధ్యాహ్నం ఎంపీపీ భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వాముల వారి ఊరేగింపు కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గుడి కాపులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
15 ఏళ్ల తర్వాత పునఃప్రారంభమైన అన్నదమ్ముల భేటీ: తాడిమర్రిలో భక్తుల కోలాహలం
