అనంతపురం జిల్లా జేఎన్టీయూ
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మహిళా వ్యాపారుల ప్రోడక్ట్ ఎక్స్పో ప్రారంభం
అనంతపురం, జేఎన్టీయూ మార్చి 7:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జేఎన్టీయూ అనంతపురం
ప్రాంగణంలో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH), అనంతపురం స్పోక్ “విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ప్రోడక్ట్ ఎక్స్ పో 2026” శనివారం ప్రారంభమైంది, రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఎక్స్పో ద్వారా మహిళా వ్యాపారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించుకునే వేదికను కల్పించడం, మహిళా ఆధ్వర్యంలోని వ్యాపారాలను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా వ్యాపారులను ప్రోత్సహించే దిశగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకున్న ఈ కార్యక్రమం అభినందనీయమని తెలిపారు. మహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావడం ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి, నూతన ఆవిష్కరణలకు ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
జేఎన్టీయూ అనంతపురం వైస్ చాన్సలర్ హెచ్, సుదర్శన్ రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మహిళలు మరియు విద్యార్థుల్లో పారిశ్రామిక ఆలోచనలను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అధ్యక్షురాలు మల్లకలవ శ్రీలత కూడా కార్యక్రమంలో పాల్గొని మహిళా వ్యాపారులు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాలను విస్తరించుకోవాలని, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ఇతర ముఖ్య అతిథులుగా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ, నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనురాధ, రుడ్సెట్ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఈ ఎక్స్ పోలో మహిళా వ్యాపారులు తయారు చేసిన హ్యాండ్మేడ్ మరియు కళాకారుల ఉత్పత్తులు, ఫ్యాషన్ మరియు జ్యువెలరీ వస్తువులు, పర్యావరణ హిత ఉత్పత్తులు, ఇంటివద్ద తయారుచేసిన ఆహార పదార్థాలు, స్టార్టప్ వినూత్న ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచారు. విద్యార్థులు, అధ్యాపకులు, వ్యాపారవేత్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్టాళ్లను సందర్శిస్తూ మహిళా వ్యాపారులను ప్రోత్సహించారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి, స్టార్టప్లు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. స్టార్టప్ ఇన్క్యుబేషన్ కార్యక్రమాలు, మెంటరింగ్ సెషన్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, వివిధ ఇన్నోవేషన్ కార్యక్రమాల ద్వారా యువత, విద్యార్థులు మరియు మహిళా వ్యాపారులను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ ఎక్స్ పోను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అవాని (AWANI – Andhra’s Women Aspiring, Nurturing, Inspiring) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎక్స్పో మొదటి రోజు సందర్శకుల నుండి మంచి స్పందన లభించగా, ఈ కార్యక్రమం రేపు కూడా కొనసాగనుంది. మహిళా వ్యాపారులు రూపొందించిన వివిధ ఉత్పత్తులను సందర్శించి కొనుగోలు చేసే అవకాశం ప్రజలకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
