Latest Posts

‘శ్రీనివాస మంగాపురం’లో వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు.. పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్!

కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై తన విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘శ్రీనివాస మంగాపురం’ నుండి మోహన్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆయన “వెంకటప్పయ్య నాయుడు” అనే గంభీరమైన పాత్రను పోషిస్తున్నారు. విడుదలైన పోస్టర్‌లో మోహన్ బాబు లుక్ ఎంతో రాజసంగా, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌ను ప్రతిబింబించేలా ఉండి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.

ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అవుతున్నారు. ఆయన సరసన బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాశా థడాని హీరోయిన్‌గా నటిస్తోంది. అజయ్ భూపతి గత చిత్రాలైన ‘RX 100’, ‘మంగళవారం’ తరహాలోనే ఈ సినిమాలో కూడా పాత్రలు ఎంతో విలక్షణంగా ఉండబోతున్నాయని సమాచారం. ముఖ్యంగా మోహన్ బాబు పోషిస్తున్న పాత్ర అహంకారం, గర్వం కలగలిసిన ఒక పవర్‌ఫుల్ వ్యక్తిత్వంతో సాగుతుందని మేకర్స్ వెల్లడించారు.

వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్, ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. అగ్ర నటులు, అగ్ర నిర్మాతలు మరియు ప్రతిభావంతుడైన దర్శకుడు కలవడంతో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాపై ఇండస్ట్రీలో ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. జయకృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో తన తాత, బాబాయిల తరహాలో వెండితెరపై మెరిసిపోవాలని ఘట్టమనేని అభిమానులు ఆశిస్తున్నారు.

Editor