- బొడ్డు కూడా కోయకుండానే
- ఒక సంచిలో చుట్టేసి రక్తం ఎండని స్థితిలో నవజాత ఆడబిడ్డ వదిలేసిన కన్నతల్లి …..
- ముళ్లకంపలో పడేసిన నవజాత ఆడబిడ్డ
- అప్రమత్తమైన గ్రామస్తులు, వేగంగా స్పందించిన వైద్య సిబ్బంది
ఏ తల్లి కన్నబిడ్డ.. ఆ తల్లికి చెప్పుకోలేని కష్టమో.. లేక పెంచలేని పరిస్థిలో ఉందో తెలియదు కాని నవమాసాలు మోసిన కన్నబిడ్డను పుట్టిన కొద్ది గడియలకే పేగుబంధం తెంపుకుంది. నవజాత శిశువును ఒక సంచిలో చుట్టేసి రక్తం ఎండని స్థితిలో నవజాత ఆడబిడ్డ కనిపించింది.
9 నెలలపాటు తన గర్భంలో మోసిన తల్లి పాలిటబిడ్డ భారంగా మారింది. మాతృత్వాన్ని మమకారాన్ని మరిచి కన్నబిడ్డను కంపచెట్లలో పారేవేసిన సంఘటన ప్రజల హృదయాలను కలచివేసింది.
కన్నతల్లి ఒడిలో ఉండాల్సిన నవజాత ఆడబిడ్డ ముళ్లకంపలో నిరాశ్రయంగా పడి ఉండటం చూసిన గ్రామస్తులు హృదయాలు కరిగిపోయిన సంఘటన అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గ్రామంలోని ప్రధాన రోడ్డు పక్కన ముళ్ల కంపలో నుంచి వినిపించిన శిశువు రోదనను గమనించిన స్థానికులు. వెళ్లి చూస్తే అక్కడ ఒక సంచిలో చూట్టేసీ ఉన్న రక్తం ఎండని, పేగుతెంచుకొని పసిపాప ఒంటరిగా పడి ఉండటం చూసి దిగ్భ్రాం తికి గురయ్యారు. వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించగా ఆరోగ్య కార్యకర్త చెన్నమ్మ హుటా హుటిన అక్కడికి చేరుకుని ముళ్ల కంపలో ఉన్న పాపను బొమ్మన హాళ్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేపట్టారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పసిపాపను చూసిన ప్రతి ఒక్కరూ బావోద్వేగానికి గురవుతూ మాతృహృదయం ఇలా ఎలా మారిందని విచారం వ్యక్తం చేస్తున్నారు.
