చట్నీస్ హోటల్‌లో భారీ పేలుడు: ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో ఉన్న ఆర్కేపురం చట్నీస్ (Chutneys) హోటల్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. హోటల్ కిచెన్‌లోని ఇడ్లీ స్టీమర్ అధిక వేడి కారణంగా ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో హోటల్‌లో ఉన్న కస్టమర్లు మరియు సిబ్బంది భయాందోళనతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

ఈ ప్రమాదంలో హోటల్‌లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కిచెన్ పరిసరాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు, హైడ్రా (HYDRAA) సిబ్బంది మరియు బాంబు స్క్వాడ్ బృందాలు హోటల్‌కు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించాయి. ఇది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. రద్దీగా ఉండే మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేగింది.

Editor