అనంతపురం జిల్లా,
రాయదుర్గం నియోజకవర్గం•••••
సమస్యలు పరిష్కరించకపోతే 25 నుంచి ఆమరణ నిరాహార దీక్ష: సహకార సంఘం ఉద్యోగుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 25వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు వెనకాడబోమని జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి డి. శ్రీనివాసులు హెచ్చరించారు.
శుక్రవారం రాయదుర్గం పట్టణంలోని కనేకల్ రోడ్డులో ఉన్న ఏడీసీసీ బ్యాంక్ కార్యాలయం వద్ద సహకార సంఘం ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమ డిమాండ్లను స్పష్టంగా వెల్లడించారు.
జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.36ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2019 నుండి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలను తక్షణమే చెల్లించాలని కోరారు. 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని నేతలు స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, జాయింట్ సెక్రటరీ మోహన్, ఉడేగడం సొసైటీ అధ్యక్షుడు ఓబయ్య, డి.కొండాపురం సొసైటీ అధ్యక్షుడు వీరభద్ర, గొల్లపల్లి సొసైటీ అధ్యక్షుడు గురుమూర్తి మద్దతు తెలిపారు. అలాగే సిపిఐ నాయకుడు నాగార్జున, సిఐటియు నాయకుడు మల్లికార్జున, విద్యార్థి సంఘం నాయకులు బంగి శివ, కోటేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘం ఉద్యోగులు రమణారెడ్డి, కె.సి. ఆంజనేయులు, నారాయణస్వామి, నరేందర్ రెడ్డి, రామాంజనేయులు తదితరులు హాజరయ్యారు.
