అసంపూర్ణ వంతెనల పూర్తికి మంత్రి హామీ! _ రైల్వే బ్రిడ్జిలపై కాలవ ప్రస్తావన

రాయదుర్గం పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన రైల్వే వంతెనలను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం రాయదుర్గంలో అసంపూర్ణంగా ఉన్న రైల్వే బ్రిడ్జిల గురించి ప్రస్తావించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టిన సదరు వంతెనలు అర్ధాంతరంగా ఆగిపోయాయన్నారు. వైకాపా ప్రభుత్వం వీటి గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో నేడు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయని ఆందోళన వ్యక్తపరిచారు. రాయదుర్గం నుండి అనంతపురం, కనేకల్లుకు వెళ్ళే ప్రధాన రహదారుల్లో రెండు వంతెనలు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. అనంతపురం వెళ్లే రహదారి జాతీయ రహదారి నెంబర్ 544 డిడిగా గుర్తించడంతో వన్ టైం ఇంప్రూమెంట్ కింద చేపట్టవచ్చని సూచించడంతో రూ.51.75 కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. రాష్ట్ర రోడ్డు భవనాలు శాఖ మంత్రి తన పలుకుబడి ఉపయోగించి ఈ పనిని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ద్వారా పూర్తి చేయించాలని కోరారు. ఎమ్మెల్యే విన్నపంపై మంత్రి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ, రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన వంతెనల ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. చాలా చోట్ల 70 నుండి 90 శాతం పనులు పూర్తయి అర్ధాంతరంగా ఆగిపోయాయన్నారు. ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకొని త్వరలో వాటిని పూర్తి చేయిస్తామన్నారు. రాయదుర్గం బ్రిడ్జి పనులు కూడా పూర్తి చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Posted Under AP
Editor