Latest Posts

వైభవంగా శ్రీ మద్దానేశ్వరస్వామి 88వ రథోత్సవం…..

అనంతపురం జిల్లా,
రాయదుర్గం నియోజకవర్గం

* వైభవంగా శ్రీ మద్దానేశ్వరస్వామి 88వ రథోత్సవం
* భక్త జనసందోహం నడుమ కన్నుల పండువగా రథోత్సవం
* ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు
* పటిష్టమైన పోలీసు బందోబస్తు

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం పరిధిలోని 74 ఉడేగోళం గ్రామ సమీపంలో వెలసిన సుప్రసిద్ధ శ్రీ మద్దానేశ్వరస్వామి వారి 88వ వార్షిక రథోత్సవం బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాల్గుణ శుద్ధ పాడ్యమి సందర్భంగా జరిగిన ఈ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
ఉత్సవం సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవతో కార్యక్రమాలు ప్రారంభమై గంగపూజ, పంచామృతాభిషేకం, సహస్ర బిల్వార్చన, విశేష పుష్పాలంకరణ, మహామంగళహారతులతో ఘనంగా కొనసాగాయి. అనంతరం ఉత్సవమూర్తిని మేళాలు, మంగళవాయిద్యాలు, డప్పుల నడుమ ప్రత్యేక పల్లకిలో ఆలయం నుంచి రథం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టించారు.
“ఓం నమఃశివాయ”, “హరహర మహాదేవ” నినాదాలతో భక్తులు స్వామివారి రథాన్ని ఎదురు బసవన్న ఆలయం వరకు భక్తిశ్రద్ధలతో లాగారు. ఈ సందర్భంగా రథంపై ప్రతిష్టించిన పవిత్ర జెండాను బహిరంగ వేలంలో పెట్టగా, కర్ణాటక రాష్ట్రంలోని చెళ్లకెర పట్టణానికి చెందిన వ్యాపారి రూ.25 వేలుకు స్వాధీనం చేసుకున్నారు.
ఉత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. భద్రతా పరంగా కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పర్యవేక్షణలో సీఐలు జయనాయక్, వెంకటరమణ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, దేవాదాయశాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు మరియు రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Posted Under AP
Editor