తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయాల్లో దుమారం రేపారు. మంగళవారం ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FCRI) 10వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో ఉన్నత చదువులు చదవకపోయినా, వేలి ముద్రగాళ్లు కూడా ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు.
మంత్రి తన ప్రసంగంలో అధికారుల గురించి మాట్లాడుతూ.. ఎంతో కష్టపడితే తప్ప ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కాలేరని, కానీ అంత చదువు చదివిన వారు కూడా చివరికి తాము (రాజకీయ నాయకులు) చెప్పినట్లే వినాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ నాయకులకు ఉన్న అధికారం గురించి విద్యార్థులకు వివరిస్తూ ఆమె ఈ పోలికను తీసుకువచ్చారు. గతంలో కూడా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆమె, తాజా వ్యాఖ్యలతో మరోసారి ప్రతిపక్షాల విమర్శలకు కేంద్రబిందువుగా మారారు.
ఇదే కార్యక్రమంలో ఆమె ఎఫ్‌సీఆర్‌ఐ సంస్థ గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని కొనియాడారు. అడవుల సంరక్షణ మరియు వాతావరణ మార్పుల నియంత్రణలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచిస్తూనే, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అయితే, అకడమిక్ వేదికపై రాజకీయ ఆధిపత్యం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
