తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు “పున్నమి నాగు” సినిమాలో నాగుపాము, పింజరలు కలిసి డ్యాన్స్ చేసినట్లుగా.. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఒక్కటయ్యాయని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అరెస్ట్ కాకుండా బీజేపీ రక్షణ కవచంలా నిలుస్తోందని, ఓటర్లు ఈ విషయాన్ని గమనించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన నిధుల విషయంలో మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని రేవంత్ రెడ్డి గణాంకాలతో వివరించారు. రాష్ట్రం నుండి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్లే ప్రతి రూపాయిలో తెలంగాణకు తిరిగి వస్తున్నది కేవలం 42 పైసలు మాత్రమేనని, అదే బీహార్‌కు 6 రూపాయలు, ఉత్తరప్రదేశ్‌కు 2.90 రూపాయలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ అసమానతలపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. “గల్లీ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం? ఆయన వచ్చి డ్రైనేజీ క్లీన్ చేస్తారా?” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలను ఆయన ప్రజల ముందుకు తెచ్చారు. మొదటి తారీఖునే జీతాలు ఇవ్వడం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మరియు రూ.9 వేల కోట్ల రైతు రుణమాఫీ వంటి విజయాలను ఆయన గుర్తు చేశారు. 70 వేల ఉద్యోగ ఖాళీల భర్తీతో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా భవిష్యత్తును మారుస్తున్నామని చెప్పారు. 12 ఏళ్ల మోదీ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మరియు ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనను బేరీజు వేసుకుని ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని ముఖ్యమంత్రి కోరారు.
