రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవలలు: సోషల్ మీడియాలో అల్లు అర్జున్ భావోద్వేగ పోస్ట్!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. జనవరి 31న ఉపాసన ఒక పాప, ఒక బాబుకు (కవల పిల్లలకు) జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. ఈ శుభవార్తపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. చరణ్, ఉపాసనలకు అభినందనలు తెలపడమే కాకుండా, మెగా కుటుంబం మొత్తం నవ్వులతో నిండి ఉండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని బన్నీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

చిరంజీవి ముఖంలో ఆ గర్వం కనిపిస్తోంది..

మెగాస్టార్ చిరంజీవి రెండోసారి తాత కావడమే కాకుండా, ఒకేసారి మనవడు, మనవరాలు రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేవని అల్లు అర్జున్ అన్నారు. “చిరంజీవి గారు, చిట్టిక్క (సురేఖ గారు) ముఖాల్లో ఆ గర్వం, సంతోషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ చిన్నారుల రాకతో ప్రపంచంలోకి కొత్త కాంతి, ఆనందం వచ్చాయి” అంటూ బన్నీ వ్యాఖ్యానించారు. కొత్తగా తల్లిదండ్రులైన చరణ్ దంపతులకు రెట్టింపు ప్రేమ, ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ఫ్యాన్ వార్స్‌కు చెక్ పెట్టిన బన్నీ విషెస్

గత కొంతకాలంగా మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇరు హీరోల అభిమానుల మధ్య తరచూ ‘ఫ్యాన్ వార్స్’ నడుస్తూ ఉంటాయి. అయితే, చరణ్ పిల్లల పుట్టిన వేళ అల్లు అర్జున్ అత్యంత ఆత్మీయంగా స్పందించడం చూస్తుంటే, ఈ రూమర్స్‌లో నిజం లేదని అర్థమవుతోంది. అల్లు అరవింద్ కూడా ఇప్పటికే చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయగా, తాజా పోస్ట్‌తో బన్నీ ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటిచెప్పారు.

Editor