దళిత నాయకుడి హత్యకు నిరసనగా తాడిమర్రిలో ఆందోళన: నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

  • దళిత నాయకుడి అమానుష హత్యను ఖండిస్తూ తాడిమర్రిలో నిరసన
    అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన –
  • దాడులు ఆగకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం: ఎస్సీ జనసంఘం హెచ్చరిక

తాడిమర్రి, ఫిబ్రవరి 02

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలో కర్నూలు జిల్లా బొందిమడుగుల గ్రామంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్ నాయకుడిపై జరిగిన అమానుష హత్యను ఖండిస్తూ తాడిమర్రి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ట్రాక్టర్‌తో గుద్ది, రాడ్లతో దాడి చేసి హత్య చేయడం దళితులపై జరుగుతున్న దాడులకు పరాకాష్టగా మారిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి నాన్‌-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా ఎస్సీ జనసంఘం ఆంధ్ర & కర్ణాటక వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే కుల్లాయప్ప, రాష్ట్ర ఇన్‌చార్జ్ మాల్యావంతం రాంప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు గణనీయంగా పెరిగాయని తీవ్రంగా విమర్శించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తాడిమర్రి మండల ఎమ్మార్పీఎస్ నాయకుడు గంగాధర్ మాట్లాడుతూ, హత్యకు గురైన రమేష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వినయ్ మాట్లాడుతూ, దళితులపై జరుగుతున్న దాడులపై స్పందించాల్సిన దళిత ఎమ్మెల్యేలు, హోం మంత్రి మౌనంగా ఉండటం బాధాకరమన్నారు. చిన్నచిన్న అంశాలపై స్పందించే ప్రభుత్వం, దళితుల అభ్యున్నతికి మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదని తీవ్రంగా మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో బీసాని నరేష్‌బాబు, బీకే పవన్‌కుమార్, బండారు వాసు, సాకే గంగాధర్, బీసాని నాగమోహన్, బీకే నరసింహులు, ఎస్సీ జనసంఘం ధర్మవరం డివిజన్ ఇన్‌చార్జ్ సంఘాల శీను, బాబు, గుమ్మలకుంట రామాంజి, గంటపురం గురు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor