చిత్రావతి నదిలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు

తాడిమరి మండలంలోని నాయనపల్లి గ్రామ సరిహద్దుల్లో ప్రవహిస్తున్న చిత్రావతి నది పరివాహ ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రోజుకు సుమారు 50 నుంచి 100 ట్రాక్టర్ల మేరకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానిక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హమని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ కారణంగా నది పరివాహ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింటుండగా, భూగర్భ జలమట్టం క్రమంగా తగ్గిపోతున్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణా కొనసాగితే భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తీవ్రంగా తలెత్తే ప్రమాదం ఉందని, పర్యావరణానికి కూడా నష్టం జరుగుతుందని సమీప గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిత్రావతి నది పరివాహ ప్రాంతాన్ని సంరక్షించాలని నాయనపల్లి గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

Posted Under AP
Editor