అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన హార్వర్డ్ యూనివర్సిటీ పర్యటనను అత్యంత ఉత్సాహంగా ముగించారు. చివరి రోజున హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఎంఐటీ, కొలంబియా యూనివర్సిటీలకు చెందిన భారతీయ విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థుల బృందాలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకత్వ లక్షణాలు, ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత వంటి అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీఎం తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. యువత తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి ఎంతో వినమ్రతను చాటుకున్నారు. లీడర్‌షిప్ గురించి పాఠాలు చెప్పాలని విద్యార్థులు కోరగా, “నేను ఇక్కడ ప్రొఫెసర్‌ని కాదు.. మీలాగే నేర్చుకోవడానికి వచ్చిన ఒక నిరంతర విద్యార్థిని” అని వ్యాఖ్యానించారు. హార్వర్డ్‌లోని మేధావులైన ప్రొఫెసర్ల మధ్య తాను కూడా విషయాలను నేర్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెప్పిన మాటలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విదేశాల్లో చదువుకుంటున్న యువత రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, తెలంగాణ ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పాలని ఆయన కోరారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో “లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ” అనే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను రేవంత్ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. మైనస్ 24 డిగ్రీల గడ్డకట్టే చలిలోనూ ఏడు రోజుల పాటు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై, అసైన్‌మెంట్‌లను పూర్తి చేసి సర్టిఫికేట్ అందుకున్నారు. తద్వారా పదవిలో ఉండగానే హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ పొందిన దేశంలోనే తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ అంతర్జాతీయ స్థాయి శిక్షణ తెలంగాణ పాలనలో నూతన ప్రమాణాలను తీసుకురావడానికి దోహదపడుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు.
