తిరుమల లడ్డూ కల్తీపై పవన్ చెప్పింది నిజమే.. సిట్ రిపోర్ట్ పై జనసేన ప్రకటన..

తిరుమల లడ్డూ ప్రసాద కల్తీ నెయ్యి వ్యవహారంపై జనసేన స్పందించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం నిజమేనని సిట్ రిపోర్ట్ ఇచ్చిందని జనసేన తెలిపింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిందే నిజమైందని వెల్లడించింది. లడ్డూ తయారీకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి బదులుగా ప్రమాదకర రసాయనాలతో 68 లక్షల కేజీల సింథటిక్ నెయ్యి వాడి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని దోపిడీకి కేంద్రంగా మార్చుకున్నారని ఆరోపించింది. రూ.250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీ ఉపయోగించిందని తెలిపింది.

 

టీటీడీ ఉద్యోగుల హస్తం

శ్రీవారి లడ్డూ తయారీకి నెయ్యి సేకరణలో జరిగిన అవకతవకలపై సీబీఐ పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కీలక దర్యాప్తును పూర్తి చేసింది. ఈ కేసుకు సంబంధించి సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు సమర్పించింది. దర్యాప్తులో టీటీడీ ఆవు నెయ్యి సేకరణ ప్రక్రియలో నేరపూరిత కుట్ర, అవినీతి, చీటింగ్, నకిలీ డాక్యుమెంట్ల వినియోగం, అధికార దుర్వినియోగం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు బయటపడ్డాయని జనసేన తెలిపింది. ఈ కుట్రలో ప్రైవేట్ డైరీ కంపెనీలు, వాటి యజమానులు, డైరెక్టర్లు, మధ్యవర్తులు, అలాగే టీటీడీలో పనిచేసిన, పనిచేస్తున్న కొందరు అధికారులు సంయుక్తంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది.

 

రసాయనాలతో నెయ్యి

నెయ్యి సరఫరా చేసిన కంపెనీల నకిలీ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లు, తప్పుడు FSSAI డాక్యుమెంట్లు, ఫేక్ బిల్లులు, లారీ రసీదులు, మొబైల్ ఫోరెన్సిక్ రిపోర్టులు, హ్యాండ్‌ రైటింగ్ నిపుణుల అభిప్రాయాలు ఈ వ్యవహారం ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రనేనని సిట్ నిర్ధారించిందని పేర్కొంది. భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి కల్తీ ప్రక్రియకు ఉపయోగపడే రసాయనాలు సరఫరా చేసినట్టు ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా నిర్ధారణ అయ్యిందని జనసేన తెలిపింది. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం కింద తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారని, ఇప్పటికే కొంతమంది నిందితులు కస్టడీలో ఉన్నారని పేర్కొంది. టీటీడీ వంటి పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంలో అవినీతికి చోటు లేకుండా చేయాల్సింది పోయి, మత విశ్వాసాలు, కోట్లాది భక్తుల నమ్మకాన్ని గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి కుంభకోణంతో మంటకలిపిందని జనసేన మండిపడింది.

Posted Under AP
Editor