బావిలో చిరుత మృతదేహం
దహన క్రియలు నిర్వహించిన అటవీశాఖ సిబ్బంది.
జిల్లా కేంద్రమైన చిత్తూరులో చెన్నమ్మగుడి పల్లి వద్ద గల ఓ బావిలో చిరుతపులి మృతదేహం లభ్యమైంది. గురువారం రాత్రి స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రాత్రి చీకటిగా ఉండటంతో అటవీశాఖ అధికారులు మృతదేహం బయటకు తీయలేదు. మొదట వారు ఇది హైనా మృతదేహం ఉంటుందని బావించారు. అయితే శుక్రవారం ఉదయం అటవీశాఖ సిబ్బంది చెన్నమ్మగుడిపల్లి వద్ద బావిలో ఉన్న మృతదేహం బయటకు తీయడంతో… అది చిరుత పులిగా తేలింది. వెంటనే వారు హడావిడిగా ఈ చిరుత మృత దేహానికి దహన క్రియలు చేసేశారు. ఈ చిరుత ఎలా మృతి చెందింది…? ఎక్కడ నుంచి వచ్చింది అనేది తేలాల్సి ఉంది. చిత్తూరు పరిసర మండలాల్లో పశువులను చిరుత చంపేస్తోందని ఇటీవల కాలంలో బాగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు నిర్ధారించలేదు. ఇపుడు చిరుత బావిలో మృతదేహమై కనిపిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ చిరుత పులి బావిలో ఎలా పడిందో అధికారులు తేల్చాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
