ముదిగుబ్బ మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పండుగ పేరుతో చట్టవిరుద్ధమైన పనులకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు.
ముఖ్యంగా కోడిపందాలు, గ్యాంబ్లింగ్, మరియు మట్కా వంటివి చట్ట ప్రకారం నేరమని పోలీసులు హెచ్చరించారు. నూతన చట్టాల ప్రకారం ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని మైకుల ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. పండుగ పూట చిక్కుల్లో పడకుండా, కుటుంబాలతో ప్రశాంతంగా గడపాలని వారు సూచించారు.
మండల పరిధిలో ఎక్కడైనా కోడిపందాలు లేదా ఇతర జూద క్రీడలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని, అసాంఘిక శక్తుల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
