Latest Posts

ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక…..

నూతన సంవత్సర వేడుకల వేళ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు రూ.713 కోట్లు విడుదల చేస్తూ బుధవారం (డిసెంబర్ 31) ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు, ప్రతి నెలా సుమారు రూ.700 కోట్ల చొప్పున బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మాటను నిలబెట్టుకుంటూ డిసెంబర్ నెలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం తాజాగా కేటాయించింది.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ, జీపీఎఫ్ (GPF), సరెండర్ లీవ్స్ మరియు వివిధ అడ్వాన్స్‌ల రూపంలో దాదాపు రూ.10 వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిల చెల్లింపు కోసం ఉద్యోగ సంఘాలు గత జూన్ నెలలో ఆందోళనకు సిద్ధమవ్వగా, ప్రభుత్వం స్పందించి విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఆగస్టు నెల నుండి క్రమం తప్పకుండా ప్రతి నెలా నిధులు విడుదల చేస్తోంది. తాజా విడుదల పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

రెండు రోజుల క్రితం శాసనసభలో కూడా ఈ బకాయిల అంశం చర్చకు వచ్చింది. ప్రతిపక్ష నాయకులు బకాయిల చెల్లింపులో జాప్యం జరుగుతోందని విమర్శించగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులను విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలను కూడా ప్రతి నెల 5వ తేదీ లోపే చెల్లిస్తున్నామని, గత ప్రభుత్వంలో నెల మధ్య వరకు వేచి చూడాల్సి వచ్చేదని మంత్రులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొత్త ఏడాది వేళ ఆర్ధికంగా ఊరట లభించడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Editor