Latest Posts

ముదిగుబ్బ అభివృద్ధికి మంత్రి సత్య కుమార్ యాదవ్ వర్చువల్ శుభారంభం: ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం

  • ముదిగుబ్బ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శుభారంభం చేసిన మంత్రి సత్య కుమార్.
  • ముదిగుబ్బలో BPHU, గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు ప్రారంభించిన మంత్రి సత్య కుమార్.
  • సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం –
  • ప్రతి గ్రామానికీ వైద్య సేవలు – కూటమి ప్రభుత్వ లక్ష్యం.
  • పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం –
  • గ్రామాలే అభివృద్ధి కేంద్రాలు – మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యలు…

ముదిగుబ్బ, డిసెంబర్ 31: (YES 9 TV): ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ (BPHU) భవనాన్ని, అలాగే మండలంలోని రామస్వామి తండా, గాండ్లవారిపల్లి, అడవిబ్రహ్మణపల్లి (ఏబీ పల్లి) తండాల్లో నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లను, అలాగే రాళ్లనంతపురం నుంచి కొడవండ్లపల్లి వరకు గంగిరెడ్డిపల్లి మీదుగా నిర్మించిన కాజ్‌వే వంతెనను బుధవారం వర్చువల్ విధానంలో రాష్ట్ర వైద్య & ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్ శుభారంభం చేశారు. అనారోగ్య కారణాల వల్ల మంత్రిగారు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినప్పటికీ, వర్చువల్ విధానంలో కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా భవనాలను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు, మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు, డీఎంహెచ్వో, ఆర్డీవో తదితర అధికారులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు వర్చువల్‌గా మాట్లాడుతూ…. ఈ రోజు మనం ప్రారంభించుకున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్, విలేజ్ హెల్త్ క్లినిక్స్ (హెల్త్ వెల్నెస్ సెంటర్లు), గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు గ్రామ స్వరాజ్యానికి బలమైన పునాది అని తెలిపారు. గ్రామాల్లో ప్రజా ఆరోగ్య సేవలు అందరికీ చేరువ కావాలన్న ప్రధానమంత్రి ఆశయంతో హెల్త్ వెల్నెస్ సెంటర్ కార్యక్రమం ప్రారంభించబడిందని, రాష్ట్రంలో వాటిని విలేజ్ హెల్త్ క్లినిక్స్గా నామకరణం చేశామని చెప్పారు. 2017లో రాష్ట్రానికి దాదాపు 10,000 కేంద్రాలు మంజూరైనా, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కేవలం 3,000 మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. అనేక కేంద్రాలు మధ్యలోనే నిలిచిపోయాయని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల ఆరోగ్యాన్ని ప్రధానంగా తీసుకొని, ప్రతి వ్యక్తికి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు రూపొందించే దిశగా ముందుకెళ్తోందని అన్నారు.
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు, పీఎం అభిమ్ పథకం కింద రూ.1200 కోట్లు మంజూరు కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన సుమారు 4,500 విలేజ్ హెల్త్ క్లినిక్స్ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. దీని ద్వారా గ్రామాల్లోని పేదలకు, ముఖ్యంగా వృద్ధులకు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ద్వారా ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సచివాలయాలు గ్రామ పరిపాలనకు కేంద్ర బిందువులుగా మారాయని, ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరేలా ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే రైతు సేవా కేంద్రాలు రైతులకు విత్తనాలు, ఎరువులు, పంటలపై సలహాలు, ప్రభుత్వ పథకాల సమాచారం ఒకే చోట అందించేలా ఏర్పాటు చేయబడినవని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. అంతే కాకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రివర్యులు పేర్కొన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా పూజారి తాండా, రామస్వామి తాండాల్లో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను కూడా పంపిణీ చేశారు. సామాజిక భద్రత పింఛన్లు పేదల జీవన భద్రతకు ఆధారమని, ప్రభుత్వం వారి పక్కనే ఉందని ఈ సందర్భంగా నాయకులు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ఫైరోజ్ బేగం, ఆర్డీవో మహేష్, ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్, ఎంపీడీవో శకుంతల, ఎమ్మార్వో నారాయణస్వామి, డిఐఓ సురేష్ బాబు, డిప్యూటీ డిఎంహెచ్వో చెన్నారెడ్డి, ఇన్చార్జి డిపిఎమ్ఓ నాగేంద్ర నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేంద్ర, వైస్ ఎంపీపీ వెంకట్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, ముదిగుబ్బ టిడిపి మండల కన్వీనర్ ప్రభాకర్ నాయుడు, బిజెపి మండల అధ్యక్షులు అంజన్ రెడ్డి, సర్పంచులు లక్ష్మీదేవి, నాగభూషణ, మినీ బాయ్, కుల్లాయప్ప నాయక్, సూర్యనారాయణ, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor