Latest Posts

తగ్గిన నేరాలు.. పెరిగిన భద్రత….

తగ్గిన నేరాలు.. పెరిగిన భద్రత

*జిల్లా పోలీసుల వార్షిక నివేదిక విడుదల
*26శాతం తగ్గిన కేసులు
*ఎస్పీ తుషార్ డూడి వెల్లడి

 

చిత్తూరు జిల్లా పోలీసు వ్యవస్థ ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటంలో నిరంతరం శ్రమిస్తూ 2025 సంవత్సరంలో మెరుగైన ఫలితాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే జిల్లాలో నమోదైన మొత్తం నేరాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గతంలో 7,034 కేసులు నమోదు కాగా… ఈ ఏడాది అవి 5,216కు తగ్గుతూ సుమారు 26 శాతం క్షీణత నమోదైంది. ఈ వివరాలను ఎస్పీ తుషార్ డూడి మంగళవారం వెల్లడించారు.

మహిళా భద్రతకు పెద్దపీట

మహిళల రక్షణ కోసం జిల్లాలో ఆరు శక్తి బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో చిత్తూరు సబ్-డివిజన్‌కు మూడు, నగరి, కుప్పం, పలమనేరు ప్రాంతాలకు ఒక్కో బృందాన్ని కేటాయించారు. శక్తి యాప్ ద్వారా ఇప్పటివరకు 6,14,138 డౌన్‌లోడ్‌లు జరగగా.. ఈ ఏడాది 962 కాల్స్ కు పోలీసులు స్పందించారు.

రికవరీలో రికార్డు… టెక్నాలజీతో చెక్

• మొబైల్ ఫోన్లు: రూ. 2.04 కోట్ల విలువైన 1,021 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు.
• సైబర్ క్రైమ్: సైబర్ ఫ్రాడ్ బాధితుల నుంచి పోగొట్టుకున్న రూ. 68.44 లక్షలను రికవరీ చేశారు.
• ఆస్తి నేరాలు: 2025లో రూ. 11.52 కోట్ల ఆస్తి దొంగతనానికి గురవ్వగా, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రూ. 8.39 కోట్ల (73శాతం) సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
• సీసీ కెమెరాల నిఘా: జిల్లా వ్యాప్తంగా 2,406 కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో 152 కేసులను ఛేదించారు.

రోడ్డు భద్రత, ఎన్ఫోర్స్మెంట్

• రోడ్డు ప్రమాదాలు: ఈ ఏడాది 762 ప్రమాదాలు జరగగా, 381 మంది మరణించారు.
• డ్రంక్ అండ్ డ్రైవ్: మద్యం తాగి వాహనాలు నడిపిన 2,772 మందిని పట్టుకుని, వారికి రూ. 2.77 కోట్ల భారీ జరిమానా విధించారు.
• మైనర్ డ్రైవింగ్: మైనర్లు నడుపుతున్న 100 వాహనాలను సీజ్ చేసి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు రూ. 1.03 లక్షల జరిమానా వసూలు చేశారు.
• ఎర్రచందనం: 5 కేసులలో 12 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి, రూ. 83.2 లక్షల విలువైన 57 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

వేగవంతమైన స్పందన (డయల్ 112)

అత్యవసర సమయాల్లో పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 8 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 17 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఈ ఏడాది డయల్ 112 ద్వారా వచ్చిన 12,474 కాల్స్ ను అటెండ్ చేసి తగిన చర్యలు తీసుకున్నారు.

వినూత్న వాహనాలు.. ‘మినీ ఫాల్కన్’

దేశంలోనే ప్రప్రథమంగా చిత్తూరు జిల్లాలో “మినీ ఫాల్కన్” వాహనాన్ని ప్రారంభించారు. ఇరుకైన గల్లీలు, పల్లెటూళ్లలో కూడా నేరాలను పర్యవేక్షించేందుకు 360 డిగ్రీల పీటీజెడ్ కెమెరాతో ఈ వాహనం పనిచేస్తుంది. సాంకేతికతను జోడించి, విజిబుల్ పోలీసింగ్ పెంచడం ద్వారా జిల్లాలో శాంతిభద్రతలను పటిష్టం చేస్తున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది.

Posted Under AP
Editor