Latest Posts

గిరిజనుల ముంగిటకే కార్పొరేట్ వైద్యం: మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

  • గిరిజనుల ముంగిటకే కార్పొరేట్ వైద్యం
  • ఉచిత మెగా వైద్య శిబిరంలో కలెక్టరు, ఎమ్మెల్యే

ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందజేస్తోందని… వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరు సుమిత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ పిలుపునిచ్చారు. మంగళవారం పూతలపట్టు పంచాయతీ పరిధిలోని గువ్వల కాలనీలో ‘గిరిజన వికాసం’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు సుమిత్ కుమార్ మాట్లాడుతూ… పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రతను ప్రతి ఒక్కరూ జీవనశైలిలో భాగం చేసుకోవాలన్నారు. 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్క గిరిజనుడు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. “తల్లిదండ్రులు తమ పిల్లలను కచ్చితంగా బడికి పంపాలి, చదువుతోనే సామాజిక మార్పు సాధ్యమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో రోడ్లు, అంగన్వాడీ కేంద్రం, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను త్వరలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు.

డ్వాక్రా సంఘాల్లో మహిళలు చేరాలి: ఎమ్మెల్యే
ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. గిరిజనులు అందరితో సమానంగా ఎదిగేందుకు తమ జీవన సరళిని మార్చుకోవాలని కోరారు. మహిళలు డ్వాక్రా సంఘాల్లో చేరడం ద్వారా లోకజ్ఞానంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెరుగుతుందన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

శిబిరంలో విశేష సేవలు

ఈ మెగా వైద్య శిబిరంలో కార్పొరేట్ నిపుణుల ద్వారా గుండె, నరాలు, కంటి పరీక్షలతో పాటు బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా వైద్యం అందించి, మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాషా మణి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, తహసీల్దారు శ్రీనివాసులు, వైద్య సిబ్బంది, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor